Exodus 6

1అందుకు యెహోవా, <<ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్ఠమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు.>>

2ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు, <<నేనే యెహోవాను; 3నేను <సర్వశక్తి గల దేవుడు> అనే పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని, యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు. 4వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను. 5ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.

6కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను. 7మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడుగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

8అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.>>

9మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకు పోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్ట లేదు.

10యెహోవా మోషేతో <<నువ్వు రాజు ఆస్థానం లోకి వెళ్లి, 11ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు>> అన్నాడు.

12అప్పుడు మోషే<<ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు>> అని యెహోవా సముఖంలో చెప్పాడు.

13అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, <<ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి>> అని ఆజ్ఞాపించాడు.

14వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.

15షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు; వీళ్ళు షిమ్యోను కుటుంబాలు.

16లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.

17గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.

18కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.

19మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.

20అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.

21ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.

22ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

23అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

24కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు.

25అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.

26ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే.

27ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే.

28ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు. 29<<నేను యెహోవాను. నేను నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.>> అందుకు మోషే, <<నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?>> అని యెహోవా సముఖంలో అన్నాడు.

30

Copyright information for TelULB